విజ్ఞాన్స్ యూనివర్సిటీ – బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ల మధ్య అవగాహన ఒప్పందం
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ – బెంగళూరులోని బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని మంగళవారం యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బెంగళూరులోని బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ అండ్ డీ వైస్ ప్రెసిడెంట్ మురళీక్రిష్ణ మీనన్, బిజినెస్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్ట్రాటజిక్ సర్వీసెస్ హెడ్ మనోగరన్‌లతో వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా వర్సిటీ వైస్ చాన్స్‌లర్ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం వలన ఫ్యాకల్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్, అకడమిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్, ఉమ్మడిగా పరిశోధనలు చేయడంతో పాటు డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లను సులభతరం చేయవచ్చునన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడానికి ఉమ్మడి శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, సెమినార్‌లు మరియు ఇండస్ట్రీ–అకాడెమియా ఇంటరాక్షన్స్‌ను నిర్వహిస్తామన్నారు. వీటితో పాటు విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించడం, ప్రాక్టికల్ ఇండస్ట్రీ అనుభవాన్ని అందించడంతో పాటు వృత్తిపరమైన వృద్ధిని పెంపొందిస్తామన్నారు. ప్రస్తుతం పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, వాటికి వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో ఉమ్మడిగా కృషి చేస్తామన్నారు. అంతేకాకుండా బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు మాస్టర్స్, పీహెచ్‌డీలు పూర్తి చేయడానికి కావలసిన సహకారాన్ని అందిస్తామన్నారు. ఈ సందర్భంగా బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ అండ్ డీ వైస్ ప్రెసిడెంట్ మురళీక్రిష్ణ మీనన్ మాట్లాడుతూ విజ్ఞాన్స్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అధ్యాపకులను, విద్యార్థులను సరికొత్త టెక్నాలజీల వైపు ప్రోత్సహించడంతో పాటు వారికి ఆయా రంగాలలో తర్ఫీదనివ్వడమే ఈ ఒప్పందం లక్ష్యమన్నారు. కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, వర్సిటీలోని ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.