డ్రైవర్ల అప్రమత్తతోనే సుఖ ప్రయాణం
- గుంటూరు జిల్లా ఉపరవాణా కమీషనర్ కే. సీతారామిరెడ్డి
- విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఘనంగా జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు
ప్రయాణీకులను సుఖంగా, భద్రంగా గమ్యం చేర్చాలన్నా, రోడ్డు ప్రమాదాలను నివారించాలన్నా డ్రైవర్ల అప్రమత్తతోనే సాధ్యమవుతుందని గుంటూరు జిల్లా ఉపరవాణా కమీషనర్ కే. సీతారామిరెడ్డి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో బుధవారం విజ్ఞాన్స్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గుంటూరు జిల్లా ఉపరవాణా కమీషనర్ కే. సీతారామిరెడ్డి మాట్లాడుతూ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపరాదని, రాష్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి నేరాలను చేయకూడదన్నారు. ముఖ్యంగా విద్యా సంస్థలలో పనిచేసే డ్రైవర్లు మరింత అప్రమత్తతో పాటు పరిమితికి మించి విద్యార్థులను బస్సు లోపలికి అనుమతించ రాదన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూగానీ, అధిక వేగంతో బస్సులను నడుపరాదని డ్రైవర్లను హెచ్చరించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి డ్రైవర్లందరూ మెడికల్ చెకప్ చేయించుకోవాలని సూచించారు. ప్రాణం ఎంతో విలువైనదని, ఏ ఒక్కరూ కూడా రోడ్డు ప్రమాదాల్లో మరణించకూడదనే ఉద్దేశ్యంతో డ్రైవర్లకు అవగాహన కల్పించే విధంగా భద్రతా మాసోత్సవాలను నిర్వహిన్నామన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని పదేపదే అవగాహన కల్పిస్తున్నప్పటికీ సామాన్య ప్రజలు పెడచెవిన వేస్తున్నారన్నారు. పొరపాటున జరగరానిది ఏదైనా జరిగితే బస్సులో ప్రాథమిక చికిత్సకు సంబంధించిన కిట్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. బస్సు రన్నింగ్‌లో ఉన్నప్పుడు విద్యార్థులను ఎక్కడం, దిగడానికి అనుమతించుకూడదని హెచ్చరించారు. ప్రతి ఒక్క డ్రైవర్ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమంగా డ్రైవింగ్ చేస్తున్న విజ్ఞాన్స్ యూనివర్సిటీ డ్రైవర్లను సన్మానించారు. అనంతరం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలకు సంబంధించిన ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, తెనాలి మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు టీ.రాఘవరావ్, మధుసూదన్‌రావ్, చేబ్రోలు మండలం ఎస్‌ఐ డీవీ.క్రిష్ణ, విజ్ఞాన్స్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్ట్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.