నెహ్రూనికేతన్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి: 24-01-2025: నూతన విద్యావిధానానికి అనుగుణంగా బాలబాలికల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు స్థానిక చెంచుపేటలో ఈ విద్యాసంవత్సరం నూతనంగా ప్రారంభించిన నెహ్రూనికేతన్ లిటిల్ వండర్స్ పాఠశాలలో 'స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్' పేరుతో శుక్రవారం ఉదయం విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. నెహ్రూనికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి పర్యవేక్షణలో
చిన్నారులు గణితం, ఆంగ్లం, సైన్స్, సాంఘికశాస్త్రం ఇత్యాది తమ పాఠ్యాంశాలకు చెందిన నమూనాలను తయారుచేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడం అందరినీ విశేషంగా అకట్టుకుంది. పౌష్టికాహారం, కూరగాయలు, పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు, పాలతో తయారైన పదార్థాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, గ్రహాల పనితీరు, భూ, జల చరాలు, జంతువుల నివాసాలు, సునాయాసంగా గణితం చేసే పద్ధతులు ఇత్యాది అనేక అంశాలను చిన్నారులు తమ ముద్దుముద్దు మాటలతో వివరించారు. విద్యార్థులు శాస్త్రీయ, వినూత్న ఆలోచనలతో చేసిన అనేక బోధనోపకరణలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ నేటి విద్యార్థుల ప్రతిభకు మార్కులు ఒక్కటే కొలమానం కాదని, విద్య అనేది వారి భవితకు పునాది కావాలనే ఆశయంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. విద్యార్థులకు ఇటువంటి నైపుణ్యాలు నేర్పించడంలో నెహ్రూనికేతన్ ముందువరుసలో ఉంది. విద్య అనేది రేపటి భవితకు ఉపయోగపడేదిగా ఉండాలి. అందులో భాగంగానే ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశాము. బాలబాలికల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ పెంచుతూ బట్టీ విధానానికి స్వస్తి పలికి వివిధ కృత్యాలు, నమూనాలు, ప్రదర్శనల ద్వారా వారిలోని సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా విద్యాబోధన, ప్రయోగాత్మక విద్యాబోధన ఇత్యాది అనేక అంశాలతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని మురళీకాంత్ తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ తరగతి గదిలో పిల్లలు ఏం నేర్చుకున్నారనే విషయం ఈ ప్రదర్శన ద్వారా పూర్తిస్థాయి అవగాహన తమకు కలిగిందని, మా పిల్లల ఆశయాలకు, మా ఆశలకు ప్రతిరూపంగా నెహ్రూనికేతన్లో విద్యాబోధన జరుగుతుందని ఆనందాన్ని వ్యక్తపరచారు. బాలబాలికలు తాము ప్రదర్శించిన అంశాలను సవివరంగా అందరికీ తెలియజేసి అబ్బుర పరచారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.