లక్ష్యాన్ని సాధించిన తర్వాత వచ్చే కిక్కే వేరు
_ గుంటూరు ఎస్పీ ఎస్.సతీష్ కుమార్, ఐపీఎస్
_ మన ప్రవర్తనే మనల్ని నిర్ణయిస్తుంది : ఇండియన్ యాక్టర్ సంపూర్ణేష్ బాబు
_ ఘనంగా ముగిసిన విజ్ఞాన్ స్రవంతి క్రీడా, సాంస్కృతిక ఉత్సవాలు
విద్యార్థులు ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాన్ని సాధించిన తర్వాత వచ్చే కిక్కు, అనుభూతిని మాటల్లో వర్ణించలేమని గుంటూరు ఎస్పీ ఎస్.సతీష్ కుమార్, ఐపీఎస్ అన్నారు. స్థానిక గుంటూరు నగరం పెదపలకలూరు రోడ్డులోని విజ్ఞాన్ డిగ్రీ, పీజీ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన ‘విజ్ఞాన్ స్రవంతి క్రీడా, సాంస్కృతిక ఉత్సవాలు–2025‘ ఘనంగా ముగించారు. చివరి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు ఎస్పీ ఎస్.సతీష్ కుమార్, ఐపీఎస్ మాట్లాడుతూ కళాశాలలో ఉన్నప్పుడే భవిష్యత్ గురించి ప్లాన్ చేసుకోవాలన్నారు. జీవితంలో మీకు నచ్చిన రంగాన్నే ఎంచుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులందరూ డ్రగ్స్‌కు, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని కోరారు. అదే విధంగా బైక్‌లపై ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని హితవు పలికారు.
మన ప్రవర్తనే మనల్ని నిర్ణయిస్తుంది : ఇండియన్ యాక్టర్ సంపూర్ణేష్ బాబు
జీవితంలో మనం ఎదుటివారితో మాట్లాడే మాటతీరు,∙ప్రవర్తనే మన స్థాయిని నిర్ణయిస్తుందని ఇండియన్ యాక్టర్ సంపూర్ణేష్ బాబు అన్నారు. మనం ఇతరులకు ఇచ్చే సంస్కారమే మనల్ని జీవితంలో ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుందన్నారు. విద్యార్థులందరూ కలలు కని వాటిని సాకారం చేసుకోవాలన్నారు. జీవితంలో దేవుడు మనకు కష్ట సుఖాలతో పాటు అవకాశాలను కూడా ఇస్తారన్నారు. ఆ అవకాశాలను వినియోగించుకున్న ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధిస్తారని పేర్కొన్నారు. జీవితంలో మనం ఎదగడానికి ఎవరి సపోర్ట్ అవసరం లేదని, మన మీద మనకు నమ్మకం ఉంటే అదే విజయానికి దరిచేరుస్తుందన్నారు. మన ఆలోచనలు ఎల్లప్పుడూ గొప్పగా ఉంటేనే మనం కూడా గొప్ప స్థాయికి ఎదగగలమని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన గుడివాడ జూనియర్ సబ్ రిజిస్ట్రార్ వీ.మణి చైతన్య మాట్లాడుతూ జీవితంలో విద్యార్థులు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా వాటిని అధిగమించాలన్నారు. విద్యార్థులు ఎల్లప్పుడు నిజాయితీ, నమ్మకం, విశ్వాసం, చిత్తశుద్ధితో ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం వివిధ పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు ప్రశంసాప్రతాలు, మెమొంటోలు అందజేసారు. కార్యక్రమంలో విజ్ఞాన్ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వీ.అనురాధ, నిరుల ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీ.రాధిక, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.