కళాకారుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన
ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్, రోటరీక్లబ్ తెనాలి వైకుంఠపురం, పట్ట రంగస్థల కళాకారుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం స్థానిక బుర్రిపాలెంరోడ్డులో బి.సి. కాలనీలోని కళాకారుల సంఘం భవనంలో రంగస్థల కళాకారుల కోసం ఉచిత నేత్రవైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాదు చెందిన ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థకు చెందిన అనుబంధ సంస్థ బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం, గూడవల్లిలోని డాక్టర్ కొమ్మారెడ్డి రాజారామ్మోహనరావు నేత్రవైద్య కేంద్రానికి చెందిన సిబ్బంది నేత్ర పరీక్షలు జరిపారు. దాదాపు రెండు వందల మంది కళాకారులు ఈ శిబిరంలో తమ నేత్రాలను పరీక్షించుకున్నారు. ఈ నేపథ్యంలో సినీ మాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ కళ్ళను పరీక్షించుకున్న అవసరమైన వారికి పది రోజుల్లో కళాకారుల సంఘం తరఫున ఉచితంగా కళ్ళజోళ్ళు అందిస్తాము. శుక్లాలు వచ్చినవారికి ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రివారు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తారని డాక్టర్ సాయిమాధవ్ తెలిపారు. ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ ఇటువంటి శిబిరాల ద్వారా కళాకారులకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించి సేవా కార్యక్రమాలు జరపతలపెట్టినట్లు పూర్ణచంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఆంధ్రప్రదేశ్ కో-ఆర్డినేటర్ వి. వెంకట్, నవీన్, రంజిత్, సుచిత్ర, కళాకారుసంఘ గౌరవ అధ్యక్షుడు ఆరాధ్యుల కోటేశ్వరరావు, అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి, కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి ఆరాధ్యుల ఆదినారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శి మేరిగె రామలింగేశ్వరరావు, కోశాధికారి దీపాల సుబ్రహ్మణ్యం, చెరుకుమల్లి సింగా, షేక్ జానిబాష, దేవరపల్లి భవానీ, కనపర్తి మధుకర్, రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు, గుత్తా వెంకటరత్నం, మురళీకృష్ణ, పావులూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.