పరోపకారి పొన్నెకంటి పోతురాజు
పొన్నెకంటి పోతురాజుగారు గుంటూరు జిల్లా,తెనాలి సమీపంలోని కొలకలూరు గ్రామంలో 1926 ఫిబ్రవరి 16న జన్మించారు. పొన్నెకంటి సత్యవేదం, యోసేపు లు వీరి తల్లిదండ్రులు. పోతురాజు చిన్ననాట తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్టిన్. వీరి తల్లిదండ్రులకు కలిగిన ఐదుగురు పిల్లల్లో పోతురాజు మొదటి సంతానం .తరువాత వారు వరసగా ఎలీషా,విక్టోరియమ్మ,వీరాస్వామి, ఎలిజబెత్ లు..
పోతురాజు ఎస్.ఎస్. ఎల్.సి. వదలి,టీచర్ ట్రైనింగ్ చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారు. కొంపల్లి కమలమ్మతో పోతురాజుకు వివాహం జరిగింది. ఆమె కూడా ఉపాధ్యాయురాలే. వీరికి సంతానం ఆరుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. వీరి పేర్లు:సుభాషిణి, సుహాసిని, విజయ కుమారి, శశి కిరణ్, సత్యకళ, బేబీ చంద్రకళ, హర్షవర్ధన్, చక్రవర్తి. వీరందరూ ఉన్నత విద్యలను అభ్యసించి, ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడినారు. ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్న చిన్న కుమారుడు తలిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ కొలకలూరు గ్రామంలోనే స్థిరపడ్డారు.
పోతురాజుది సాధారణ కుటుంబమే అయినా, వీరిది ప్రత్యేకమైన కుటుంబం. అందుకే ఈ కథంతా. పోతురాజు చిన్ననాటి నుండే హాస్యప్రియుడు, సృజనశీలి. ఆంగ్లంలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. ఎంతో మంది విద్యార్థులకు, యువతకు ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలలో శిక్షణనిచ్చారు. వాచికాభినయంలో, నటనలో మేటి కళాకారుడు. పచ్చి రావి ఆకులను హార్మోనికగా మలిచి, రాగ, తాళాలతో పద్యాలు, పాటలూ హృద్యంగా పాడేవారు. అంతేగాదు, పోతురాజు స్వయంగా కళా పోషకుడు. సామాజిక, సాంస్కృతిక కార్యకలాపాల్లో ఎంతో చురుకుగా, బాధ్యతాయుతంగా పాల్గొనేవారు. ఆయనలోని ఈ విలక్షణ సానుకూల అంశాలే వారికీ, వారి కుటుంబానికి ఒక ప్రత్యేకతను సంతరించి పెట్టాయి. ఇటువంటి పరిచయాలన్నీ - విద్య, నాటక, సినీ, సాంస్కృతిక, రాజకీయ రంగాలకు చెందిన అనేకమంది ప్రముఖులతో పోతురాజుకు, వారి కుటుంబ సభ్యులకు స్నేహం, సాన్నిహిత్యం పెరగడానికి దారితీశాయి.
మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్,వారి సతీమణి భవనం జయప్రద,మహాకవి గుఱ్ఱం జాషువా, పద్మశ్రీ బోయి భీమన్న, సినీ నటుడు, కళావాచస్పతి కొంగర జగ్గయ్య, వారి అల్లుడు డాక్టర్ అచ్యుతరామయ్య, ప్రఖ్యాత సినీనటి శారద వంటి ప్రముఖులు పోతురాజుగారి ఇంటికి వచ్చి వెళ్ళేవారు. అలాగే, 1964 సంవత్సరంలో అప్పటి దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి టి.యన్. సదాలక్ష్మి చేతులమీదుగా కొలకలూరులో గాంధీ - కెన్నెడీ కళాక్షేత్రానికి ప్రారంభోత్సవం చేయించారు. ఆ సభకు అప్పటి గుంటూరు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు కన్నెగంటి రెడ్డమ్మ అధ్యక్షత వహించారు. బాబూ జగ్జీవన్ రామ్, వారి కుమార్తె, లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, కేంద్ర మాజీ మంత్రి పాశ్వాన్ మొదలగు జాతీయ నాయకులను కొలకలూరు గ్రామ సందర్శనకు రప్పించడంలో పోతురాజు కృషి మరువలేనిది. పోతురాజు మాన్యవర్ కాన్షీరామ్‌తో కలిసి రాజకీయ సభలో పాల్గొనడం ఒక అద్భుత ఘట్టం.
మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య,బొజ్జా అప్పలస్వామి మొదలగువారితో పోతురాజుగారికి పరిచయం ఉండేది. ప్రఖ్యాత నాటక కళాకారుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత వల్లూరి వెంకట్రామయ్య చౌదరి, స్వాతంత్ర్య సమరయోధుడు లలితం, వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడుగారి మనవడుతో పోతురాజుకు మంచి మిత్రత్వం ఉండేది. ప్రఖ్యాత న్యాయవాదులు జొన్నలగడ్డ జోషి, సితార కళాకారుడు, జడ్జి జొన్నలగడ్డ ఐజక్, అడ్వకేట్ ఆవుల గోపాలకృష్ణమూర్తి, మంత్రిగా పనిచేసిన హై కోర్టు సీనియర్ న్యాయవాది గొల్లపూడి వేదాంతరావు గారలతో, ప్రముఖ రచయిత దావల ఆండ్రూస్‌తో మంచి పరిచయం ఉండేది. అలాగే, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్‌కు పోతురాజు తో వారి కుటుంబ సభ్యులతో ఎంతో ఆత్మీయ బంధం ఉన్నది. మనోహర్ ఎప్పుడు పోతురాజు ఇంటికొచ్చినా, పెద్దాయనతో కూర్చుంటే నేనొక రాజకీయ నాయకుడిగా కాక, ఒక ఆత్మీయ కుటుంబ సభ్యుడితో కూర్చున్నట్టుగా అనిపిస్తుందని, నా మనసుకు ఎంతో నెమ్మది, శాంతి కలుగుతుందంటూ ఉంటారు. నేటికీ పోతురాజుగారి కుటుంబ సభ్యులతో నాదెండ్ల మనోహర్ ఈ అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
ఉద్యమకారులు, బాటసారులు, అక్కరలో ఉన్నవారికి పోతురాజు ఎంతో సహాయం చేసేవారు. ఇలాంటి ఎంతోమందికి పోతురాజు ఇల్లు ఆశ్రయంగా ఉండేది. ఎమర్జెన్సీ కాలంలో చెరుకుపల్లి పోలీసు స్టేషన్‌పై దాడి కేసులో నిందితులని తెలియక, వారికి పోతురాజు వారి ఇంట్లో కొద్దికాలం ఆశ్రయం ఇచ్చారు. ఇందువలన,పోతురాజుగారు కొన్నాళ్ళు ఇక్కట్ల పాలై, అజ్ఞాతంలోకి వెళ్ళవలసివచ్చింది.
ఎంతోమంది వ్యవసాయ కూలీలకు పోతురాజు అప్లికేషన్లు రాసిపెట్టి, రిప్రజెంట్ చెయ్యగా, నాటి టెనెంట్స్ చట్టం క్రింద ఎంతోమంది వ్యవసాయ కూలీలు భూ యజమానులు అయ్యారు. ఈ సందర్భంగా పోతురాజుపై హత్యా ప్రయత్నం కూడా జరిగింది.
పోతురాజుగారు లోకం బసవపున్నయ్యతో కలిసి కొలకలూరుకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెప్పించారు. అగస్త్యేశ్వర స్వామి దేవాలయ ట్రస్టు డైరెక్టర్‌గా పనిచేశారు. కొలకలూరులోని రథసప్తమి తిరునాళ్ళలో ఆయన రెండు రథాలను లాగేవారు.
తన సోదరి విక్టోరియమ్మతో కలిసి గ్రామంలో క్వారీలు పెట్టకుండా జీవితాంతం అడ్డుకున్నారు. గ్రామంలో పదమూడు ఎకరాలలో ఉన్న సమాధులకు కాంపౌండ్ వాల్ కట్టించారు. గ్రామంలో రాజకీయ ఏకీకరణ జరగాలంటే పోతురాజుగారు ఉండి తీరాల్సిందేనని ప్రజలు నమ్మేవారు. దుగ్గిరాల అసెంబ్లీ నియోజకవర్గానికి అవుతు రామిరెడ్డి, బొంతు గోపాలరెడ్డి మొదలైనవారు స్వతంత్ర ఎమ్మేల్యేలుగా గెలవడానికి పోతురాజుగారు చేసిన కృషి విశేషమైనది. సమీప బంధువు, ఉన్నత విద్యావంతుడు, అడ్వకేట్, ప్రఖ్యాత సినీ, నాటక రచయిత, గేయకారుడు, నటుడు, ప్రయోక్త స్వర్గీయ మోదుకూరి జాన్సన్‌లోని ప్రతిభా పాటవాలను మొదటగా గుర్తించి,ఆయనకు ప్రోత్సాహాన్నిచ్చినవారు, జాన్సన్ మరణం వరకూ ఆయనకు తోడుగా నిలిచినవారు పొన్నెకంటి పోతురాజు. కవి నూతక్కి అబ్రహాం, రావూరి కోటేశ్వరరావు మొదలగువారితో కలిసి పోతురాజు ఆ రోజుల్లో పప్పుకూటి నాటక పరిషత్‌ను స్థాపించి, ఎన్నో రంగస్థల నాటకాలను ప్రదర్శించారు. ఉదాహరణకు వీటిలో కొన్ని:
ఖడ్గ తిక్కన నాటకంలో - ఖడ్గ తిక్కన
పాపక్షమ నాటకంలో - సైతాను
నటనాలయం నాటకంలో - గిజిగాడు
మాస్టార్జీ నాటకంలో - విదూషకుడు
విజయ సుశీల నాటకంలో - విజయుడు
సత్య హరిశ్చంద్ర నాటకంలో - కాటిసీను హరిశ్చంద్రుడు
మొదలగు పాత్రలను పోతురాజు అద్భుతంగా పోషించి, వీక్షకులను మెప్పించేవారు. అలాగే, సామాజిక రుగ్మతలపై భారతంలో మరో హరిశ్చంద్రుడు, భస్మ సింహాసనం వంటి ఏకపాత్రలను స్వయంగా సృష్టించి, పోతురాజు స్వయంగా ప్రదర్శించి, వీక్షకుల్లో చైతన్యం తెప్పించేవారు.
గుఱ్ఱం జాషువాగారి శిష్యురాలైన విమలమ్మ శిష్యరికంలో పోతురాజు చిన్ననాటే పాటలు, పద్యాలు మంచిగా ఆలపించడంలో, నటనలోను తగిన శిక్షణ పొందారు. అలాగే, డప్పు, సితార వాద్యాలు, చిందు నాట్యములలో మంచి ప్రవేశము ఉండటమే గాక చాలా ఇష్టపడేవారు.
చిన్ననాటే విజయవాడ గోపరాజు రామచంద్రరావు (గోరా)గారి నాస్తిక సమాజ కేంద్రంలో పోతురాజు శిక్షణ పొందారు.. కొలకలూరు గ్రామంలో తన చిన్నాన్న పొన్నెకంటి బెంజమిన్‌గారు స్థాపించిన విద్యాసంస్థల అభివృద్ది కోసం పోతురాజు తన తమ్ముడు ఎలీషాతో కలిసి కృషి చేశారు. గ్రామాన్ని వదలకుండా, కులాన్ని చూడకుండా, అవసరంలోవున్న వారికి ఎందరికో సహాయం చేసి, విద్యార్థి, యువకుల్లో ప్రతిభను వెలికితీసిన ధన్యజీవి పొన్నెకంటి పోతురాజు. జీవితాన్ని స్నేహమయంగా, సౌశీల్యంగా,సహాయకారిగా, పరోపకారంగా, ఆనందంగా మలుచుకున్న మంచి మనీషి.
94 సంవత్సరాల జీవితాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా, పరిపూర్ణ జీవనోత్సాహంతో జీవించిన ఆయన 2017, నవంబర్ 9న మరణించారు.
ఇది పోతురాజు శత జయంతి సంవత్సరం. వారి మంచి జ్ఞాపకాలు సదా మనలో నిలిచే వుంటాయి. వారికిదే నివాళి.
సేకరణ: