సందడి సందడిగా విజ్ఞానోత్సవ్
- దేశానికి అమూల్యమైన సంపద యువత : వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్
- రెండోరోజు వైభవంగా కొనసాగిన విజ్ఞాన్ మహోత్సవ్–2కే25
- విద్యార్థులతో ముచ్చటించి.. సందడి చేసిన సినీ తారలు
- పోటాపోటీగా కొనసాగుతున్న పోటీలు
- అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
- వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన విద్యార్థులు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
నేటి ముగింపు కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ఇండియన్ ఫిల్మ్ డైరక్టర్, స్క్రీన్ రైటర్ కే.ఎస్.రవీంద్ర (బాబీ), 2024 పారాలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్, ఇండియన్ పారా పిస్టల్ షూటర్, అర్జున అవార్డీ రుబినా ప్రాన్సిస్
ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 80 ఈవెంట్లు. కనుచూపు మేర ఎటువైపు చూసినా విద్యార్థులు క్రీడా సంబరాల్లో మునిగిపోయారు. వాలీబాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, చెస్, అథ్లెటిక్స్, త్రోబాల్, ఫుట్‌బాల్, హాకీ, తైక్వాండో, ఖోఖో, ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్, యోగాసన..... ఇలా ఒకటేమిటి అనేక విభాగాల్లో విద్యార్థులు అద్భుత ప్రదర్శనలతో ఉర్రూతలూగించారు. ఒకరితో ఒకరు నువ్వా నేనా అన్నట్లు పోటీపడి విజయాలు సాధిస్తున్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో జరుగుతున్న జాతీయస్థాయి విజ్ఞాన్ మహోత్సవ్–2కే25 పోటీలు విద్యార్థులను ఆసాంతం అబ్బురపరిచింది.
దేశానికి అమూల్యమైన సంపద యువతేనని, దేశ భవిష్యత్‌ను మార్చగలిగే శక్తి యువతకే ఉందని విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో జాతీయ స్థాయి విజ్ఞాన్స్ మహోత్సవ్ కార్యక్రమం రెండో రోజు శుక్రవారం సందడి సందడిగా సాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మాట్లాడుతూ ఆటల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం వలన జిజ్ఞాస, సమర్ధ సమయ పాలన, బుద్ధి స్థిరత్వం, వేగంగా సంగ్రహించుకోగలగడం... ఇలా ఎన్నో అంశాలు అభివృద్ధి చెందుతారన్నారు. అంతేకాకుండా 1.సమయ పాలన 2.లక్ష్యాలను ఏర్పరుచుకోవడం 3. శ్రద్ధగా వినడం, 4. నిర్వహణ నైపుణ్యాలు, 5. అప్‌డేట్, 6. కమ్యూనికేషన్, 7. నెట్‌వర్కింగ్, 8. పఠనం... మెళకువలు వంటి వాటిలో నిష్ణాతులవుతారని పేర్కొన్నారు. ఇది సాధించలేనేమో అనే భయం, సందేహాలకు జీవితంలో ఎప్పుడూ కూడా తావివ్వొద్దని సూచించారు. క్రీడలు శారీరక ఉల్లాసానికే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడుతాయని అన్నారు. శారీరక, మానసిక ధృఢత్వంతో పాటు స్నేహ సంబంధాలు మెరుగుకు క్రీడలు దోహదం చేస్తాయన్నారు. చదువుతో పాటు క్రీడలు, సృజనాత్మకత అంశాలపై ప్రావీణ్యం సాధించినప్పుడే సంపూర్ణ విద్యార్థులు అవుతారని పేర్కొన్నారు.
పోటాపోటీగా క్రీడలు
జాతీయ స్థాయి విజ్ఞాన మహోత్సవ్‌లో భాగంగా నిర్వహిస్తున్న పోటీల్లో విద్యార్థులు నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్నారు. అథ్లెటిక్స్‌లో భాగంగా 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్ల పరుగు పందేలను నిర్వహించారు. వీటితో పాటు వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో, ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్, చెస్ పోటీలను నిర్వహించారు. విజ్ఞాన్ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహిస్తున్న పోటీలన్నీ కూడా సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. నేడు ఫైనల్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
నేడు సందడి చేయనున్న క్రీడా, సినీ తారలు
విజ్ఞాన్స్ మహోత్సవ్‌లో భాగంగా నేడు జరిగే ముగింపు కార్యక్రమానికి ఇండియన్ ఫిల్మ్ డైరక్టర్, స్క్రీన్ రైటర్ కే.ఎస్.రవీంద్ర (బాబీ), 2024 పారాలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్, ఇండియన్ పారా పిస్టల్ షూటర్, అర్జున అవార్డీ రుబినా ప్రాన్సిస్ విచ్చేస్తున్నారని వైస్ చాన్స్‌లర్ తెలిపారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు
తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పడుతున్న విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగిన కళలు, సృజనాత్మక నైపుణ్యాలకు పదును పెడుతూ మూడు రోజుల పాటు జరగనున్న పోటీల్లో రెండో రోజు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు సోలో సాంగ్స్, లఘు నాటికలు, రెట్రో డాన్స్ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కళాకారులు పలు నృత్య రూపకాలకు అనుగుణంగా నర్తించి మంత్రముగ్ధుల్ని చేశారు. ముఖ్యంగా జానపద, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఓలలాడించాయి. వీటితోపాటు మ్యూజిక్, లిటెరరీ, స్పాట్‌లైట్, డాన్స్, డ్రమాటిక్స్ అండ్ ఫిల్మ్ మేకింగ్, ఫ్యాషన్, ఫైన్ ఆర్ట్స్, కల్చరల్స్, థియేటర్ ఆర్ట్స్ పోటీల్లో విద్యార్థులు సత్తాచాటారు. జాతీయ స్థాయి విజ్ఞాన్ మహోత్సవ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లు విద్యార్థులను ఆకర్షించాయి. కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి ( ఎమ్మెస్, ఎఫ్.పీ.ఓఎస్), వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.