సాంకేతికతను రైతుల వద్దకు తీసుకెళ్లాలి
* న్యూఢిల్లీలోని ఐకార్ – ఐఏఆర్‌ఐ డైరెక్టర్, వైస్ చాన్స్‌లర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు
*విజ్ఞాన్స్ వర్సిటీ– ఐఐఓపీఆర్ ( ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్)ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం
* విజ్ఞాన్స్ వర్సిటీలో ఘనంగా అకడమియా ఇండస్ట్రీ ఫార్మర్ పార్టనర్‌షిప్స్ కాన్‌క్లేవ్
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
పరిశోధనల్లో అభివృద్ధి అయిన సాంకేతికతను వ్యవహారికంగా రైతుల వద్దకు తీసుకెళ్లాలని న్యూఢిల్లీలోని ఐకార్ – ఐఏఆర్‌ఐ ( ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) డైరెక్టర్, వైస్ చాన్స్‌లర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ రిలేషన్స్‌ల ఆధ్వర్యంలో ‘‘ అకడమియా ఇండస్ట్రీ ఫార్మర్ పార్టనర్‌షిప్స్ కాన్‌క్లేవ్ ’’ను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజ్ఞాన్స్ వర్సిటీ– ఐఐఓపీఆర్ ( ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్)ల మధ్య అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ పెదవేగిలోని ఐఐఓపీఆర్ డైరెక్టర్ డాక్టర్ కే.సురేష్‌కు అందజేసారు. ఈ కార్యక్రమానికి అనేక విద్యా సంస్థల ప్రతినిధులు, పరిశ్రమల ప్రముఖులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు రైతులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యూఢిల్లీలోని ఐకార్ – ఐఏఆర్‌ఐ డైరెక్టర్, వైస్ చాన్స్‌లర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పరిశ్రమల అవసరాలకు తగ్గ వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడం, మరియు అకడెమియా–ఇండస్ట్రీ–ఫార్మర్ మధ్య సహకారాన్ని బలపరచాలన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి సాంకేతికత, పరిశోధన, పరిశ్రమలు మరియు రైతుల మధ్య భాగస్వామ్యం కీలకమని అభిప్రాయపడ్డారు. పరిశ్రమలు తమ అవసరాలను అకడెమిక్ సంస్థలకు తెలియజేస్తే, విద్యా సంస్థలు తగిన పరిశోధనలు చేపట్టి రైతులకు అవసరమైన పరిష్కారాలను అందించగలవని పేర్కొన్నారు. ఇదే సమయంలో, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశోధకులు అధ్యయనం చేసి సమర్థవంతమైన పరిష్కారాలను తీసుకురావాలని సూచించారు.
కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ఇలాంటి భాగస్వామ్య వేదిక రైతులకు నూతన మార్కెట్ అవకాశాలను కల్పించడంతో పాటు, అధునాతన వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంచే అవకాశం కల్పిస్తుందని అన్నారు. వ్యవసాయంలో ఇన్నోవేషన్, సస్టైనబిలిటీ మరియు టెక్నాలజీ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ విజయగాథలను పంచుకుంటూ, పరిశ్రమలతో భాగస్వామ్యం వలన ఉత్పత్తి విలువ ఎలా పెరిగిందో వివరించారు. ఇలాంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారి చూపుతాయని, విద్యా, పరిశ్రమలు మరియు రైతుల మధ్య బలమైన సంబంధం ఏర్పడితే దేశ ఆహార భద్రత మరింత బలపడుతుందని కాన్‌క్లేవ్‌కు హాజరైన నిపుణులు అభిప్రాయపడ్డారు. అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గుంటూరులోని ఆంగ్రూ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఆర్.శారద జయలక్ష్మి దేవి, డాక్టర్ వైఎస్సార్‌హెచ్‌యూ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కే.గోపాల్, సంగం సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఆలపాటి సత్యనారాయణ, హైదరాబాద్‌లోని ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ సీ.తారా సత్యవతి, రాజమండ్రిలోని సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషు మాధవ్, పెదవేగిలోని ఐఐఓపీఆర్ డైరెక్టర్ డాక్టర్ కే.సురేష్, విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైస్ చాన్స్‌లర్,కల్నల్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, ఇంచార్జి రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.